గుంటూరు 'మేయర్‌' టికెట్‌ కోసం కుర్చీలాట! కూటమిలో పోటాపోటీ.. 'వైసీపీ'లో అభ్యర్థుల కరువు ..!
04:18 pm Oct 13, 2026

..మహిళా రిజర్వేషన్‌తో నేతల ప్లాన్ మొత్తం రివర్స్!

..కూటమిలో ఆరుగురు ఆశావహులు.. ఆ ఒక్క టికెట్ ఎవరికి?

Advertisement

..అంబటి మౌనిక పేరు తెరపైకి.. పోటీ చేస్తారా? వెనక్కి తగ్గుతారా?

..గుంటూరు మేయర్ పీఠంపై చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా?

మహానాడు, అమరావతి :
గుంటూరు నగరపాలక సంస్థ  (GMC) పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు మేయర్ స్థానాన్ని ‘జనరల్ మహిళ’ కేటగిరీకి రిజర్వ్ చేయడంతో నగర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రిజర్వేషన్ ఖరారు కాకముందు వరకు “మేయర్ పీఠం మాదే” అంటూ హడావుడి చేసిన నేతలంతా, ఇప్పుడు తమ సతీమణులను రంగంలోకి దింపి టికెట్ వేట ముమ్మరం చేశారు.

కూటమిలో ‘సతీమణుల’ సమరం: ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు

మేయర్ టికెట్ ఆశించిన కూటమి నాయకులు ఇప్పుడు తమ జీవిత భాగస్వాములను మేయర్ రేసులో నిలబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు హోరెత్తిస్తూనే, నగర పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలను కలిసి తమకే అవకాశం ఇవ్వాలని పైరవీలు మొదలుపెట్టారు.

ప్రస్తుతం కూటమి తరఫున మేయర్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు:

కోవెలమూడి అపర్ణ : మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర సతీమణి

భీమనాధం శివ శిరీష: సిమ్స్ విద్యాసంస్థల అధినేత భరత్ రెడ్డి సతీమణి

మీనా రత్న: పారిశ్రామికవేత్త మాదాల చైతన్య సతీమణి

తాళ్ళ ఉమాదేవి: టీడీపీ సీనియర్ నాయకుడు తాళ్ళ వెంకటేష్ యాదవ్ సతీమణి

డేగల భువనేశ్వరి: ఏపీ ఇండస్ట్రియలిస్ట్ చైర్మన్ డేగల ప్రభాకర్ సతీమణి

డాక్టర్ విజయ: ప్రముఖ లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి

ఆశావహుల జాబితా చాంతాడంత ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక కూటమి అధిష్టానం తలలు పట్టుకుంటోంది.

వైసీపీలో నైరాశ్యం: పోటీకి వెనకడుగు వేస్తున్న నేతలు?   

ఒకవైపు కూటమిలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంటే, ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు పార్టీ నేతలు వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం నగరంలో జోరుగా సాగుతోంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టాలని భావించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం లేదని భావించిన అంబటి రాంబాబు, “ఓడిపోయే సీటు కోసం నా కూతురిని ఎందుకు బలిచేయడం?” అంటూ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించి, పోటీకి విముఖత చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నోటిఫికేషన్ వేళ.. తేలేదెవరు? 

రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ వెలువరించనున్న నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కింది.

భారీ పోటీ ఉన్న అధికార కూటమి ఎవరికి జై కొడుతుంది?

డిఫెన్స్‌లో పడ్డ ప్రతిపక్ష వైసీపీ అసలు ఎవరిని బరిలోకి దింపుతుంది?

నోటిఫికేషన్ విడుదలైన రెండు రోజుల్లోనే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండటంతో, గుంటూరు మేయర్ పీఠంపై అంతిమంగా పైచేయి ఎవరిదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.