వైసీపీ డీఎస్సీ వ్యూహం.. లోకేష్‌కు ‘మెగా’ పబ్లిసిటీ?!
05:39 pm Aug 26, 2026

..రాజీనామా డిమాండ్‌లో లోకేష్‌ నామజపం!
..కోర్టుల్లో చుక్కెదురైనా కొనసాగిన ఆందోళనలు
..శాసనమండలి కార్యకలాపాల స్తంభన
..వైసీపీ ఆరోపణలను పట్టించుకోని జనం
..లోకేష్‌ వివరణలపైనే యువతలో చర్చలు
..జెన్‌-జీ పేరుతో సాధించింది ఏంటి?

మహానాడు, అమరావతి: మెగా డీఎస్సీ.. వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశం. సహజంగానే రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన వైసీపీకి.. రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిందా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

డీఎస్సీ ప్రక్రియపై అనుమానాలు, ఆరోపణలతో వైసీపీ కోర్టులను ఆశ్రయించింది. ఆందోళనలు చేపట్టింది. ‘జెన్‌-జీ ఉద్యమం’ పేరుతో యువతను సమీకరించే ప్రయత్నం చేసింది. శాసనమండలిలోనూ ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. డీఎస్సీపై చర్చ జరగాలని పట్టుబట్టారు.

శాసనసభలో విద్యాశాఖ మంత్రి ప్రజెంటేషన్..

అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ డీఎస్సీ నియామక ప్రక్రియపై వివరాలను ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నియామక ప్రక్రియను ఎలా చేపట్టారు? ఎక్కడెక్కడ పారదర్శకత పాటించారు? అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలు కల్పించారు? అన్న అంశాలపై ప్రభుత్వ వివరణను ప్రజల ముందు ఉంచగలిగారు.

అసెంబ్లీ సెషన్స్‌లో ‘హ్యాండ్సప్‌’..

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ పదేపదే డీఎస్సీ అంశాన్ని లేవనెత్తుతుంటే.. అదే సమయంలో లోకేష్‌కు తన పనితీరును వివరించుకునే అవకాశం దక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనలు కూడా రాజకీయ దుమారం రేపాయి.

అసలే శాసనసభకు వైసీపీ గైర్హాజరవుతోంది. మండలిలో కూడా డీఎస్సీపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్సీలు.. సభలో ఎలాంటి చర్చకు అవకాశమివ్వలేదు. దీంతో నిరుద్యోగుల సమస్యపై చర్చ జరగాల్సిన వేదికపై వైసీపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు తీర్పుల తర్వాత కూడా అదే సీన్‌!

ఇక కోర్టుల వ్యవహారం కూడా వైసీపీకి పెద్ద మైనస్‌ అయిందన్న చర్చ జరుగుతోంది. డీఎస్సీపై దాఖలైన పలు కేసులను రాజకీయ ప్రయోజనం కోసం వేశారంటూ కోర్టులు మొట్టికాయలు వేశాయని వైసీపీపై విమర్శలు వచ్చాయి. కోర్టు తీర్పుల తర్వాత కూడా వైసీపీ మాత్రం ఆరోపణలను కొనసాగిస్తోంది.

ఇదే సమయంలో ‘జెన్‌-జీ ఉద్యమం’ పేరుతో చేపట్టిన నిరసనలు కూడా చర్చకు దారితీశాయి. యువత సమస్యను తమకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నించినా.. చివరకు ఆ ఉద్యమం కంటే ప్రభుత్వం, లోకేష్‌ ఇచ్చిన కౌంటర్లనే ఎక్కువగా చర్చించుకునే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వచ్చాయి.

వైసీపీకి బూమరాంగ్‌ అయిన వ్యూహం

డీఎస్సీని అడ్డంపెట్టుకుని లోకేష్‌ను టార్గెట్‌ చేయాలనుకున్న వైసీపీ.. తెలియకుండానే ఆయనకు విస్తృత ప్రచారం కల్పించిందన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, శాసనమండలి, కోర్టులు, రోడ్డుపై నిరసనలు.. ఇలా ప్రతి వేదికపైనా డీఎస్సీ చర్చకు రావడంతో లోకేష్‌ పేరు కూడా అంతే స్థాయిలో రాజకీయ చర్చలోకి వచ్చింది.

లోకేష్‌ రాజీనామా డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ట్రై చేసిన వైసీపీ డీఎస్సీ ఆందోళనలు బూమరాంగ్‌ అయ్యాయన్న టాక్‌ నడుస్తోంది. అటు వైసీపీ ఆందోళనలు కొనసాగుతుండగానే ప్రభుత్వం ‘2026 జాబ్‌ క్యాలెండర్‌’ ప్రకటించి, అందులో మళ్లీ టీచర్‌ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ ఇచ్చి.. ట్విస్ట్‌ ఇవ్వడం గమనార్హం.