రియల్ లైఫ్‌ ‘మెగా’ పవర్‌.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌!
03:47 pm Sep 02, 2026

..గెలుపోటములతో పనిలేదు..

..ప్రశ్నించే తత్వంతో పొలిటికల్‌ పవర్‌ చూపిస్తున్న జనసేనాని..

..కులం కాదు.. జనం ముఖ్యం అంటూ అడుగులు..

..మెగా హీరో వర్షిప్‌ వదులుకుని.. పాలిటిక్స్‌లోకి..

..ఓటములు ఎదురైనా సడలని పట్టుదల..

..ప్రజాపోరాటాలతో ఎన్డీఏ ఘనవిజయానికి పునాదులు..

..1971 సెప్టెంబరు 2న జన్మించిన కొణిదెల బ్రదర్‌..

..పరిపూర్ణ పొలిటీషియన్‌ దిశగా అడుగులు..

మహానాడు, అమరావతి: డిప్యూటీ సీఎం హోదాలో మూడో జన్మదినం జరుపుకుంటున్నారు పవర్‌స్టార్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌. జనసేన స్థాపించిన రోజు నుంచి.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగిన ఆయన ప్రయాణం అంత ఆషామాషీ కాదు. సినీ భాషలో చెప్పాలంటే.. అది రియల్‌ లైఫ్‌ బ్లాక్‌బస్టర్‌.

అన్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న పవన్‌.. రాజకీయాలను మార్చాలన్న లక్ష్యంతో.. ప్రశ్నించే నైజంతో 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు.

అధికారం కోసం కాదు.. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. ‘ప్రజల పక్షాన నిలబడాలి.. ప్రజా సమస్యలపై పోరాడాలి’ అనే ఆలోచనతో జనసేన ప్రయాణం మొదలైంది.

రాజకీయంగా ఎత్తుపల్లాలు..

ఒక నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌.. రాజకీయాల్లో మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుంచి 2024లో డిప్యూటీ సీఎం అయ్యే వరకు ఆయన ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది.

2019లో ఎదురుదెబ్బ!

2014 ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. జనసేన పోటీకి దూరంగా ఉంది. పవర్‌స్టార్‌ క్రేజ్‌ టీడీపీ, బీజేపీల విజయానికి దోహదపడింది. కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో అసలు పరీక్ష 2019లో ఎదురైంది.

జనసేన తొలిసారి సోలోగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా అనూహ్య పరాజయం ఎదుర్కొన్నారు.

జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా జగన్‌కు జై కొట్టడంతో.. ‘ఇక జనసేన కథ ముగిసినట్టే!’ అని ప్రత్యర్థులతో పాటు పలువురు విశ్లేషకులు తెగ హడావుడి చేశారు. కానీ ఆ ‘పవర్‌’ ఫెయిల్యూర్‌తోనే అసలు కథ మొదలైంది.

వెనకడుగు వేయకుండా…

ఎమ్మెల్యేగా గెలవలేని వాడు ‘ఏం పొడుస్తాడు’ అని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నా.. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు, రైతుల సమస్యలపై గళమెత్తుతూ.. యువతకు ఉపాధి, ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై నిరంతర పోరాటాలు కొనసాగించారు.

మరోవైపు పార్టీ బలోపేతానికి తన స్టైల్లో కృషి చేస్తూ వచ్చారు. ‘ఒక్క ఓటమితో నాయకత్వం ముగియదు.. నిలబడినప్పుడే నాయకత్వం మొదలవుతుంది’ అని నిరూపిస్తూ.. 2024 ఎన్నికల నాటికి గేమ్‌ ఛేంజర్‌గా ఆవిర్భవించారు.

2024 ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ.. జనసేన.. బీజేపీ కలిసి కూటమిగా మళ్లీ బరిలోకి దిగాయి. ఆ పొత్తుల ఏర్పాటులో జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేసి.. ఎన్నికల ముందే ఎన్డీఏ విజయానికి బాటలు వేశారు.

సీట్ల విషయంలో జనసేనాని త్యాగాలు..

పోటీ చేసే సీట్ల విషయంలో బీజేపీ కోసం త్యాగాలు చేశారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో తిరుగులేని విజయం సాధించి.. హండ్రెడ్‌ పర్సెంట్‌ స్ట్రైక్‌రేట్‌తో అపురూప విజయం సాధించారు.

పిఠాపురం నుంచి ఘన విజయం సాధించిన పవన్‌.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడే.. 2024లో తన పార్టీ పోటీ చేసిన ప్రతి అసెంబ్లీ స్థానాన్నీ గెలిపించిన నాయకుడిగా చరిత్ర సృష్టించి.. యావత్తు దేశం దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు.

2024 జూన్‌ 12.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని.. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ–పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి కీలక శాఖలను నిర్వహిస్తూ.. సక్సెస్‌ఫుల్‌ నేతగా అడుగులు వేస్తున్నారు.

ఎన్డీఏ హయాంలోనే ప్రత్యేక హోదా కోసం గళం..

తాను మద్దతిచ్చిన టీడీపీ, బీజేపీలు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లుగా ఉన్నప్పుడే.. అంటే 2016–18 కాలంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్‌ కల్యాణ్‌ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. 2016లో కాకినాడలో నిర్వహించిన ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ ద్వారా తన రాజకీయ వైఖరిని మరింత స్పష్టం చేశారు.

అమరావతి రైతుల నీరాజనం..

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని నిలబెట్టేందుకు రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి పవన్‌ కల్యాణ్‌ మొదటి నుంచి పూర్తి అండగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పటి నుంచి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ఆయన రైతులకు నైతిక, రాజకీయ మద్దతును అందించారు.

అమరావతి రైతుల పోరాటాన్ని ‘ధర్మయుద్ధం’గా అభివర్ణించిన పవన్‌ కల్యాణ్‌.. డిప్యూటీ సీఎం హోదాలో అమరావతి రోడ్డుపై వెళ్తున్నప్పుడు అమరావతి రైతులు, మహిళలు పూలవర్షం కురిపించి.. భారీ గజమాలతో అత్యంత ఘనంగా స్వాగతం పలికి అభిమానం చాటుకున్నారు.

ఇక ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులు, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, ఉచిత ఇసుక విధానం రద్దు, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోడానికి ఆయన సాగించిన పోరాటాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 

పవన్‌ కల్యాణ్‌ ప్రజాక్షేత్రంలో చేసిన నిరంతర పోరాటాలు.. 2024 ఎన్నికల్లో జనసేన–టీడీపీ–బీజేపీ కూటమి ఘనవిజయానికి బలమైన పునాదిగా నిలిచాయి. వైసీపీని అధఃపాతాళానికి తొక్కుతానని ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించి.. దాన్ని చేసి చూపించి.. రియల్‌ లైఫ్‌ ‘పవర్‌స్టార్‌’గా సూపర్‌హిట్‌ కొట్టి దూసుకుపోతున్నారు.