వైఎస్ శిష్యుడిగా మొదలు.. టీడీపీ నేతగా ముగింపు.. కొడాలి.. పేర్ని నానిలకు భిన్నంగా.. ‘ఆళ్ల నాని’ ..!
..57 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో హఠాన్మరణం..!
..ఏలూరు సెంట్రిక్‌గా రాజకీయాల్లో ఎదిగిన నేత.
..కాంగ్రెస్ నుంచి 2 సార్లు, వైసీపీలో ఒకసారి ఏలూరు ఎమ్మెల్యే.
..వైద్య శాఖ మంత్రిగా కోవిడ్ సమయంలో విశేష సేవలు.
..టీడీపీ నేతగా ముగిసిన ప్రస్థానం.
మహానాడు, ఏలూరు:
ఏలూరు సెంట్రిక్‌గా రాజకీయాల్లో ఎదిగిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని హఠాన్మరణం పార్టీలకు అతీతంగా అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఏలూరులోనే పుట్టి పెరిగి, ఏలూరు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి, వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని 57 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మరణించడం ఏలూరు రాజకీయాల్లో తీవ్ర విషాదం నింపింది.
వైఎస్ ప్రియ శిష్యుడిగా గుర్తింపు..
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని, దివంగత వైఎస్ ప్రియ శిష్యుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2013లో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
కొడాలి, పేర్ని నానిలకు భిన్నం… హుందాగా రాజకీయం
వైసీపీ ‘నానీల త్రయం’లో ఒకరైన ఆళ్ల నాని పరుష పదజాలం జోలికి పోకుండా వివాదరహితుడిగా అందరి మనస్సుల్లో నిలిచిపోయారు. అదే కొడాలి నాని, పేర్ని నానిలు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు ఆ పార్టీ ‘బూతు’ మంత్రులకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారు. అయితే మృదుస్వభావి ఆళ్ల నాని మాత్రం అధిష్ఠానం ఆదేశించినా, వారిలా ప్రత్యర్థులపై నోరు పారేసుకోకుండా హుందాగా మెలిగారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెచ్చిన ఘనత..
కరోనా సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి నిరంతరం శ్రమించిన నాయకుడిగా వైద్య శాఖ మాజీ మంత్రి ఆళ్ల నాని ప్రశంసలు పొందారు. ఆ సంక్షోభ సమయంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, బాధితులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించారు.
కరోనా చికిత్సను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చి, పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా కోవిడ్ వైద్యం అందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
2024 ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసి, కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆళ్ల నాని, 2025 ఫిబ్రవరి 13న అధికారికంగా టీడీపీలో చేరి.. టీడీపీ నేతగానే తన ప్రస్థానం చాలించి.. విషాదం మిగిల్చారు.
ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు ‘మహానాడు మీడియా’ ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తోంది 🙏