టీడీపీ ఎంపీ ‘లావు’ కృష్ణదేవరాయలు గారు.. ఒకసారి ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటే మంచిదేమో?!
..కేంద్రం కోట్లిచ్చింది.. పల్నాడుకు చేరింది ఎంత?
..ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో రాష్ట్ర టీడీపీ ఎంపీల్లో చివరి స్థానమా?
..లోక్‌సభలో దూకుడు.. పల్నాడులో అభివృద్ధి నిధులపై నిర్లక్ష్యమేనా?
..వెనుకబడిన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయడంలో ఎందుకీ జాప్యం?
మహానాడు, అమరావతి: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ, టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు.. పార్లమెంటులో చురుగ్గా వ్యవహరిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రూ.17.40 కోట్లు.. ఖర్చు రూ.24 లక్షలేనా?
కేంద్రం ఎంపీ ల్యాడ్స్ కింద లావు శ్రీకృష్ణదేవరాయులుకు రూ.17.40 కోట్ల నిధులు కేటాయించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు అందులో సుమారు రూ.24 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు ఆ నివేదికలో నమోదైంది. అంటే అందుబాటులో ఉన్న నిధుల్లో దాదాపు 1.4 శాతం మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది.
పల్నాడు వెనుకబాటుపై దృష్టి ఎక్కడ?
నరసరావుపేట పార్లమెంటు పరిధిలో పలు అభివృద్ధి సమస్యలు ఉన్నాయని.. ఇలాంటి ప్రాంతంలో ఎంపీ ల్యాడ్స్ నిధులను విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. తాగునీరు, రహదారులు, విద్య, మౌలిక వసతులు వంటి అంశాల్లో ఈ నిధులను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
లోక్‌సభలో మంచి మార్కులు.. మరి నియోజకవర్గం?
పార్లమెంటులో హాజరు, ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడం వంటి అంశాల్లో లావు శ్రీకృష్ణదేవరాయులు చురుగ్గా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ లోక్‌సభా పక్ష నాయకుడిగా కీలక బాధ్యత కూడా దక్కింది. అయితే పార్లమెంటరీ పనితీరుతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపైనా అదే స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిధులు వాడుకోకపోతే.. ప్రయోజనం ఏంటి?
ఎంపీ ల్యాడ్స్ నిధులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం ఉంటుంది. నిధుల వినియోగానికి నిబంధనలు ఉన్నప్పటికీ.. అందుబాటులో ఉన్న మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే పనులకు మళ్లించడం ఎంపీ బాధ్యతలో కీలకమైన భాగం.
‘లావు’ గారూ.. ఓసారి లెక్క చూసుకోండి!
ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులుపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాంటప్పుడు నియోజకవర్గానికి అందుబాటులో ఉన్న కోట్లాది రూపాయల నిధుల్లో ఇంత తక్కువ మొత్తమే ఖర్చు కావడంపై ఆయన స్వయంగా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందన్న చర్చ టీడీపీ వర్గాల్లోనూ వినిపిస్తోంది.
మొత్తానికి.. పార్లమెంటులో తనదైన శైలిలో దూసుకెళ్తున్న లావు శ్రీకృష్ణదేవరాయులు.. పల్నాడు అభివృద్ధిపైనా అదే దూకుడు చూపిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పల్నాడు ప్రగతిలోనూ ‘లావు’ మార్క్ కనిపిస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు.