‘వెలిగొండ’పై వైసీపీ క్రెడిట్‌ వార్‌.. జనం నవ్వుకుంటున్నారా?
09:38 pm Aug 31, 2026

..ప్రాజెక్ట్‌ పూర్తికాగానే క్రెడిట్‌ కోసం వైసీపీ హడావుడి!
..అన్ని కీలక ప్రాజెక్టులు తన ఘనతే అంటున్న జగన్‌
..జగన్‌ హయాంలోనే అంతా జరిగిందంటూ వైసీపీ ప్రచారం
..నేడు 30 ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభోత్సవం!

మహానాడు, అమరావతి: రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఏ పనైనా తమదే క్రెడిట్‌ అని వైసీపీ చేసుకుంటున్న ప్రచారం కామెడీగా తయారైంది.

ప్రతి కీలక ప్రాజెక్ట్‌ విషయంలో వైసీపీ ‘క్రెడిట్‌ చోరీ’ ఆరోపణలు, తమ హయాంలోనే అన్ని పూర్తయ్యాయని సాక్షి మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై జనం ఈసడించుకునే పరిస్థితి తలెత్తుతోంది.

తాజాగా వెలిగొండ ప్రాజెక్ట్‌పై వైసీపీ అనుకూల మీడియా కథనాలు.. అందుకు సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1 ప్రారంభోత్సవ సభలో ఇచ్చిన కౌంటర్‌తో ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చ మొదలైంది.

ప్రారంభం సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం

వెలిగొండ ప్రాజెక్ట్‌.. మూడు దశాబ్దాలుగా కరువు సీమలో జనం ఎదురుచూస్తున్న ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌’కు ఇప్పుడు ప్రారంభోత్సవం జరిగింది. సీఎం చంద్రబాబు సంప్రదాయ పంచకట్టుతో ఫేజ్‌-1 పనులు ప్రారంభించి, కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసి భావోద్వేగానికి గురయ్యారు.

అది జరగడానికి ముందే వైసీపీ మీడియా ‘క్రెడిట్‌ చోరీ’ అంటూ యాగీ మొదలుపెట్టింది. వెలిగొండ ప్రాజెక్ట్‌ విషయంలో దివంగత వైఎస్సార్‌ హయాం నుంచి పనులు జరిగాయని.. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వంలో పనులు మరింత వేగంగా జరిగాయని వైసీపీ చెబుతోంది.

క్రెడిట్‌ దక్కించుకోవడానికి వైసీపీ మీడియా ప్రచారం

కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండ పనులను ముందుకు తీసుకెళ్లామని వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది.

వెలిగొండ ట్విన్‌ టన్నెల్స్‌ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న అప్పటి సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారని గుర్తు చేస్తోంది. నిర్వాసితులకు కాలనీలు.. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌.. ఇలా కీలకమైన అంశాలన్నీ జగన్‌ హయాంలోనే జరిగాయని వైసీపీ వాదన.

వెలిగొండ పనులు జగన్‌ ప్రభుత్వ హయాంలోనే కీలక దశకు చేరుకున్నాయని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మొత్తం క్రెడిట్‌ను తీసుకునే ప్రయత్నం చేస్తోందని వైసీపీ అనుకూల మీడియా ఆరోపిస్తోంది.

చంద్రబాబు డైరెక్ట్‌ అటాక్‌..

ఆ క్రమంలో వెలిగొండ ఫేజ్‌-1 ప్రారంభోత్సవ సభలో వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నేరుగా అటాక్‌ చేశారు. 2019లో ‘గొడ్డలి పార్టీ’ రావడంతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2024లో కూటమి ప్రభుత్వం రావడంతో ఆ గ్రహణం వీడిందని, నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి.. అరకొర చెల్లింపులతో వారిని మోసం చేశారని సీబీఎన్‌ ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు డ్రామా ఆడారని ధ్వజమెత్తారు.

టీబీఎం యంత్రం ఇరుక్కుపోయి పూర్తికాని సొరంగం పనులు

వైసీపీ హయాంలో సొరంగాల్లో టీబీఎం యంత్రం ఇరుక్కుపోయిందని, సొరంగం పనులు పూర్తి కాలేదని గుర్తు చేశారు. 11 ఏళ్ల పాటు దివంగత వైఎస్సార్‌, జగన్‌ అధికారంలో ఉండి పనులను చేయలేకపోయారని విమర్శించారు.

రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉంచి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన పార్టీని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. వాస్తవానికి వెలిగొండ ప్రాజెక్ట్‌ అనేది ఒక్క ప్రభుత్వ హయాంలో పుట్టి.. ఒక్క ప్రభుత్వ హయాంలో పూర్తయిన ప్రాజెక్ట్‌ కాదు.

శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభోత్సవం

1996లో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబే.. తిరిగి 30 ఏళ్ల తర్వాత ప్రారంభించి చరిత్ర సృష్టించారు. మధ్యలో పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం, తర్వాత విభజిత ఏపీలో వైసీపీ సర్కారు నామ్‌కే వాస్తే పనులతో షో చేసినట్లు విమర్శలు ఉన్నాయి.

మొత్తానికి ఏ కీలక అభివృద్ధి కార్యక్రమం తెరపైకి వచ్చినా వైసీపీ ‘నేనున్నానంటూ’ క్రెడిట్‌ వార్‌ మొదలుపెట్టడం తీవ్ర విమర్శల పాలవుతోంది.

పూల సుబ్బయ్య కుమార్తెలకు చంద్రబాబు సన్మానం

వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరుతో నామకరణం జరిగింది. పూల సుబ్బయ్య కుమార్తెలను చంద్రబాబు ప్రారంభోత్సవ సభలో సన్మానించి తన గొప్పతనం చాటుకున్నారు. జగన్‌ హయాంలో దివంగత పూల సుబ్బయ్య పేరు స్మరించిన పాపాన కూడా పోలేదు.

అసలు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని.. చూస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని పూల సుబ్బయ్య కుమార్తె విలాసిని పేర్కొనడం సీఎం చంద్రబాబు దార్శనికతకు అద్దం పడుతోందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.