కూటమి మళ్లీ వస్తే.. వైసీపీలో ‘జంపింగ్’ జాతరేనా?
..జగన్ సమీక్షకు వరుసగా మాజీ ఎమ్మెల్యేల డుమ్మా!
..వైసీపీలో అసంతృప్తుల మౌనం.. పార్టీ మార్పుపై ఊహాగానాలు
..జనసేన చేరికల కమిటీతో కొందరు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం
..కూటమి గెలుపుపై క్లారిటీ వస్తే.. కీలక నేతల జంపింగ్?
మహానాడు, అమరావతి: వైసీపీలో అసంతృప్తి స్వరాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొందరు మాజీ నేతలు.. ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా జగన్ నిర్వహించిన సమీక్షకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.
సమీక్షకు డుమ్మా.. ఇదే సంకేతమా?
జగన్ నిర్వహించిన సమావేశానికి చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం వైసీపీలో చర్చకు దారితీసింది. తాము పార్టీకి దూరం కాలేదని.. కొంత విరామం మాత్రమే తీసుకుంటున్నామని కొందరు చెబుతున్నప్పటికీ.. అసలు కారణం వేరే ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది.
అవకాశం కోసం ఎదురుచూపులా?
ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఇప్పుడే పార్టీ మారితే రాజకీయంగా ప్రయోజనం ఉండదని కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతానికి మౌనం పాటిస్తూ.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారన్న చర్చ ఉంది.
జనసేనతో టచ్‌లో ఉన్నారా?
మరోవైపు జనసేన చేరికల కమిటీతో కొందరు వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సైతం కొందరు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని చెప్పడం ఆసక్తి రేపుతోంది. అయితే ఆ నేతల పేర్లు మాత్రం బయటకు రాలేదు.
కూటమి గెలిస్తే.. జంపింగులేనా?
ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ప్రజల నాడి, రాజకీయ పరిణామాలు, సర్వేలను వైసీపీలోని కొందరు నేతలు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి స్పష్టమైతే.. వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
జగన్‌కు అసలు సవాలు ఇదేనా?
కీలక నేతలు మౌనంగా మారడం.. సమావేశాలకు దూరంగా ఉండటం.. ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలను పరిశీలిస్తున్నారన్న సంకేతాలు రావడం వైసీపీ నాయకత్వానికి కొత్త సవాలుగా మారుతోంది.
మొత్తానికి.. ఇప్పుడే జెండా మార్చకుండా.. ఫలితం చూసి అడుగు వేయాలనే వ్యూహంలో కొందరు వైసీపీ నేతలు ఉన్నారా? కూటమి మళ్లీ గెలిస్తే.. వైసీపీలో ‘జంపింగ్’ జాతర మొదలవుతుందా? అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.