‘పిల్లల’ తప్పులు.. ‘పొలిటీషియన్’లకు తలనొప్పులు..!
..పిల్లలు మేజర్లు అయితే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా?
..రాజకీయ అండ ఉంటే.. చట్టం కూడా చుట్టమేనా?
..ప్రజా ప్రతినిధులుగా నైతిక బాధ్యత ఎక్కడ?
..రాజకీయ నాయకుల కుటుంబాలకు ప్రత్యేక రూల్స్ ఏమైనా ఉంటాయా?
మహానాడు, అమరావతి: రాజకీయ నాయకుల వారసుల చుట్టూ వరుసగా వివాదాలు, కేసులు తెరపైకి రావడంతో ఒక కీలక ప్రశ్న మరోసారి చర్చనీయాంశంగా మారింది. పిల్లలు మేజర్లు అయిన తర్వాత వారు చేసే తప్పులకు తల్లిదండ్రులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం? అదే సమయంలో, తల్లిదండ్రులు రాజకీయ పదవుల్లో ఉన్నప్పుడు తమ పలుకుబడిని ఉపయోగించి పిల్లలను చట్టపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తే.. అది కేవలం కుటుంబ వ్యవహారంగానే చూడాలా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు ఘటనలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. అయితే ప్రతి ఘటన స్వభావం వేరు. ఒకదానితో మరొకదాన్ని పోల్చడం కంటే.. ఆ కేసులో అసలు ఆరోపణ ఏమిటి? తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే ఆధారాలున్నాయా? అనే అంశాలను విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది.
చట్టం ముందు మేజర్ పిల్లలే బాధ్యులు
చట్టపరంగా చూస్తే.. ఒక వ్యక్తి మేజర్ అయిన తర్వాత అతను చేసే నేరానికి సాధారణంగా అతడే బాధ్యత వహించాలి. తండ్రి లేదా తల్లి రాజకీయ నాయకుడు కావడం వల్ల వారి పిల్లల తప్పులకు తల్లిదండ్రులు ఆటోమేటిక్‌గా నిందితులు కాలేరు.
అందుకే ఒక రాజకీయ నాయకుడి కుమారుడు లేదా కుమార్తెపై కేసు నమోదైతే.. ‘తల్లిదండ్రుల తప్పేంటి’ అనే వాదనకు కూడా బలం ఉంది. కానీ సమస్య అక్కడితో ముగియడం లేదు. అసలు ప్రశ్న.. రాజకీయ పలుకుబడి ఉపయోగించారా? పిల్లలు చేసిన తప్పు తర్వాత తల్లిదండ్రుల పాత్ర ఏంటి? అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
కేసు నమోదైన తర్వాత పోలీసుల దర్యాప్తులో సదరు నేతలు జోక్యం చేసుకున్నారా? సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా? అధికారులను ఒత్తిడికి గురిచేశారా? నిందితుడిని తప్పించేందుకు వ్యవస్థను ఉపయోగించారా? వంటి ఆరోపణలు నిజమైతే.. అది కేవలం పిల్లల వ్యక్తిగత వ్యవహారంగా మిగలదు. అలాంటి సందర్భంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న తల్లిదండ్రులపై రాజకీయ, నైతిక ప్రశ్నలు రావడం సహజమే.
‘బండి సంజయ్’ కుమారుడి పోక్సో కేసు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన వ్యవహారం కూడా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. బండి సంజయ్ మాత్రం తన కుమారుడిపై రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.
కేసు నిజమా కాదా అనేది దర్యాప్తు, కోర్టు తేల్చాల్సిన అంశం. కానీ తండ్రిగా బండి సంజయ్‌కు ఉన్న బాధ్యతను, కేంద్ర మంత్రిగా ఆయన రాజకీయ బాధ్యతను వేరు చేసి చూడాలా? అన్నదే అసలు ప్రశ్న.
ఒకవేళ కేసు తప్పుడు ఆరోపణ అయితే కుమారుడికి న్యాయం జరిగేలా పోరాడటం తండ్రిగా ఆయన హక్కు. అదే సమయంలో కేసు దర్యాప్తును ప్రభావితం చేశారనే నిర్దిష్ట ఆధారాలు ఉంటే మాత్రం అది వేరే అంశం.
‘సీదిరి అప్పలరాజు’ కొడుకు కేసుతో చిక్కులు
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మపై కేసు నమోదైంది. ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మరణించినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు దర్యాప్తు చేసి ఆరవ్ వర్మను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇక్కడే వ్యవహారం మరో మలుపు తిరిగింది. కేసును పక్కదారి పట్టించేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై సీదిరి అప్పలరాజుపైనా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అప్పలరాజు వర్గం మాత్రం దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపించింది. సీదిరిపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే.. ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు ఉండొచ్చు.
‘జోగి రమేష్’ కుటుంబంపై గృహహింస కేసు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలోనూ కుమారుడు రాజీవ్ భార్య మేఘన చేసిన ఫిర్యాదుతో వివాదం మొదలైంది. తన భర్త, అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి.
ఈ వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు, కుటుంబ వివాదాలు రెండూ కలిసిపోయాయి. కుటుంబ వివాదానికి కూడా జోగి రమేష్ రాజకీయ రంగు పులమాలని చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొడుకు లోపం తెలిసి కూడా ఆయన బలవంతంగా పెళ్లి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలతో నిరూపితమైతే.. జోగి రమేష్ పాత్రపై కూడా చట్టపరమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
‘కొండా సురేఖ’ కుమార్తె వ్యాఖ్యలు.. తల్లికి పార్టీ నోటీసులు
తెలంగాణలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన రాజకీయ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. పరకాల టికెట్ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారం పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది.
ఇక్కడ మాత్రం పరిస్థితి మరోలా ఉంది. కుమార్తె చేసిన రాజకీయ వ్యాఖ్యలకు తల్లిని నేరుగా బాధ్యురాలిగా చేయవచ్చా? అన్న చర్చ జరుగుతోంది. కుమార్తె స్వతంత్రంగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి అయిన తల్లి బాధ్యత వహించాల్సిన అవసరం లేదనే వాదనకు బలం ఉంది.
అయితే కొండా సుస్మిత కూడా రాజకీయంగా యాక్టివ్‌గా ఉండటం, తల్లి పుట్టినరోజు వేడుకలే ఈ వివాదానికి వేదిక కావడంతో సురేఖ కూడా రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు.
‘లింగమనేని రమేష్’ కుమారుడి కారు ప్రమాదం
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో కారు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందింది. ఈ కేసులో జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో మరోసారి.. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రాజకీయ నాయకుడి కుమారుడైతే.. అతనికి ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ ఉండకూడదన్న డిమాండ్ వినిపిస్తోంది.
అదే సమయంలో తండ్రి రాజకీయ నాయకుడు కావడం వల్ల ఆయనను కూడా నిందితుడిగా చూడటం కరెక్ట్ కాదన్న వాదన ఉంది. తన కుమారుడి విషయంలో చట్టపరమైన ప్రక్రియకు సహకరించారా లేదా? అన్నదే చూడాల్సి ఉంటుంది.
బిడ్డలపై కేసు వచ్చినప్పుడు నాయకుడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించారా? పోలీసులపై రాజకీయ ఒత్తిడి తెచ్చారా? కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారా? అధికారాన్ని వ్యక్తిగత కుటుంబ ప్రయోజనానికి ఉపయోగించారా? లేక ‘చట్టం తన పని తాను చేసుకుంటుంది’ అని పక్కకు తప్పుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానమే రాజకీయ నాయకుడి నైతిక బాధ్యతను నిర్ణయిస్తుంది.
ప్రత్యేకంగా రాజకీయ కుటుంబాల్లో పెరిగే పిల్లలకు చిన్న వయసు నుంచే అధికార వర్గాలతో పరిచయాలు, భద్రత, పలుకుబడి వంటి వాతావరణం ఉంటుంది. అది వారి ప్రవర్తనపై ప్రభావం చూపుతుందా? అన్నది సామాజికంగా చర్చించాల్సిన అంశమే.
‘బేతాళ’ ప్రశ్న ఇదే!
పిల్లలు మేజర్లు అయిన తర్వాత వారి తప్పులకు తల్లిదండ్రులను నేరుగా శిక్షించలేం. అదే సమయంలో తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులై ఉండి తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పిల్లల కేసులను ప్రభావితం చేసినా.. ‘పిల్లలు మేజర్లు.. మాకు సంబంధం లేదు’ అని చెప్పినా అది కరెక్ట్ కాదు.
తల్లిదండ్రుల అధికారాన్ని ఉపయోగించి పిల్లల తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం జరిగితే.. అది కుటుంబ విషయం కాదు, ప్రజా జీవితానికి సంబంధించిన తీవ్రమైన నైతిక ప్రశ్నే.