విజయవాడ మేయర్ రేసులో ‘వంగవీటి’ వారసురాలు?!
..టీడీపీలోకి వంగవీటి వారసురాలు?
..వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర చర్చ
..ఇప్పటికే రాజకీయంగా యాక్టివ్.. టీడీపీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం
..విజయవాడ మేయర్ పీఠంపై ఆశా కిరణ్ కన్ను?
..కాపు సమీకరణాలకు వంగవీటి వారసురాలి పేరును పార్సిలిస్తున్న టీడీపీ?
..టీడీపీ కండువా కప్పుకుంటారా?.. మేయర్ రేసులో నిలుస్తారా? అనేది వేచి చూడాలి
మహానాడు, విజయవాడ: బెజవాడ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంపై చర్చ మొదలైంది. దివంగత నేత ‘వంగవీటి మోహనరంగా’ కుమార్తె ‘వంగవీటి ఆశా కిరణ్’ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే రాధా-రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్న ఆమె.. ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు బెజవాడ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
అయితే ఆశా కిరణ్ టీడీపీలో చేరడం, మేయర్ అభ్యర్థిత్వం వంటి అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాజకీయాల్లో యాక్టివ్‌గా.. ఇప్పుడు ఏ పార్టీ?
గత కొంతకాలంగా ఆశా కిరణ్ ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాధా-రంగా మిత్రమండలి ద్వారా తన తండ్రి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో ఆమె వైసీపీలో చేరుతారని, ఆ తర్వాత జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు.
ఇప్పుడు మాత్రం టీడీపీ వైపు ఆమె అడుగులు పడుతున్నాయన్న ప్రచారం కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది.
టార్గెట్ ‘మేయర్’ పీఠమేనా?
త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ మేయర్ స్థానం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆశా కిరణ్‌ను టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచన ఉందన్న ప్రచారం జరుగుతోంది.
వంగవీటి కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, విజయవాడలో రంగా కుటుంబానికి ఉన్న పరిచయం నేపథ్యంలో ఆమెకు అవకాశం ఇస్తే పార్టీకి రాజకీయంగా కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాలలో ఉంది.
బెజవాడలో కొత్త సామాజిక సమీకరణాలకు ప్లాన్?
విజయవాడ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎప్పుడూ కీలకమే. వంగవీటి కుటుంబానికి ఉన్న కాపు సామాజిక వర్గ అనుబంధాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే వ్యూహంలో భాగంగానే ఆశా కిరణ్ పేరు తెరపైకి వచ్చిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వారసురాలి ఎంట్రీతో మారేనా బెజవాడ లెక్కలు?
వంగవీటి మోహనరంగా కుమార్తె రాజకీయాల్లోకి రావడం నిజమైతే.. అది కేవలం ఒక కుటుంబ వారసురాలి రాజకీయ ప్రవేశంగానే కాకుండా విజయవాడలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అంశంగా మారే అవకాశం ఉంది.
టీడీపీ కండువా కప్పుకుంటారా? మేయర్ రేసులో నిలుస్తారా? లేక రాజకీయ ప్రవేశానికి మరో వేదికను ఎంచుకుంటారా? వంగవీటి వారసురాలి తదుపరి అడుగు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది.