‘వైసీపీ’ v/s ‘వైసీపీ’.. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?
..ప్రత్యర్థి పార్టీలతో పోరాడాల్సిన నేతలు.. సొంత పార్టీలోనే డిష్యుం..డిష్యుం.
..సుమారు 30 నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత పోరు?
..వచ్చే సార్వత్రిక ఎన్నికల టికెట్లే వైసీపీలో కొత్త చిచ్చుకు కారణమా?
..ప్రత్యర్థులపై పోరాటం కంటే.. సొంత పార్టీ నేతలతోనే ఫైట్ ఎందుకు?
..వైసీపీ వర్సెస్ వైసీపీ.. నియోజకవర్గాల్లో పెరుగుతున్న అంతర్గత పోరు.
మహానాడు, అమరావతి: సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది.. కానీ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వైసీపీలోని నేతల మధ్యే విభేదాలు, ఆధిపత్య పోరు, వచ్చే ఎన్నికల టికెట్‌పై పోటీ బహిరంగంగా కనిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీంతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల కంటే.. వైసీపీ నేతల మధ్యే రాజకీయ పోరు ఎక్కువగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కందుకూరులో ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం!
కందుకూరులో వైసీపీ ఇన్‌ఛార్జ్ బొర్రా మధుసూదన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇన్‌ఛార్జ్ పనితీరుపై మహీధర్‌రెడ్డి విమర్శలు చేస్తుండగా.. పార్టీలో ప్రాధాన్యం లేనివారు కూడా మాట్లాడుతున్నారంటూ బొర్రా మధుసూదన్ యాదవ్ కౌంటర్ ఇస్తున్నట్లు సమాచారం.
దీంతో కందుకూరులో వైసీపీ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
శింగనమలలో టికెట్ కోసం ముచ్చటగా మూడు వర్గాలు?
శింగనమల నియోజకవర్గంలోనూ వైసీపీ అంతర్గత పోరు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వీరాంజనేయులు ప్రజల్లో ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వర్గాలు కూడా వచ్చే ఎన్నికల టికెట్‌పై ఆసక్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశం ఇప్పటినుంచే నియోజకవర్గంలో వర్గ విభేదాలకు కారణమవుతోందనే చర్చ ఉంది.
విజయవాడ వెస్ట్‌లో ‘రిపోర్టుల’ రచ్చ!
విజయవాడ వెస్ట్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పోతిన మహేశ్ వర్గాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆ ఇద్దరూ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. ఎవరికి పార్టీ అవకాశం ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇటీవల ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం ఈ అంతర్గత పోరును మరింత బహిర్గతం చేసిందనే చర్చ విజయవాడ వీధులలో జరుగుతోంది.
గన్నవరంలోనూ అదే పరిస్థితి!
గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, వైసీపీలోని కొందరు నేతలకు మధ్య గ్యాప్ కొనసాగుతోందనే ప్రచారం జరుగుతుంది.
పార్టీలో తనకు, ఇతర నేతలకు మధ్య సమన్వయం లేదన్నట్లుగా వంశీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారిటేసాయి.
వంశీని వైసీపీలోని కొందరు నేతలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అంగీకరించడం లేదనే ప్రచారం కూడా ఉంది., దీంతో గన్నవరంలో సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు ఉన్నాయన్న చర్చ కొనసాగుతోంది.
అసలు సమస్య ఏంటి?
ఈ నియోజకవర్గాలను పరిశీలిస్తే.. చాలాచోట్ల వచ్చే ఎన్నికల టికెట్ అంశమే అంతర్గత విభేదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ప్రత్యర్థి పార్టీలపై పోరాటం చేయాల్సిన సమయంలో సొంత పార్టీలోని నేతలే బల ప్రదర్శనకు దిగడంతో పార్టీకి నష్టం జరుగుతుందని అధిష్టానం ఆగ్రహిస్తుంది.
ప్రస్తుతం ఇవి పార్టీ అంతర్గత పరిణామాలే అయినప్పటికీ.. ఎన్నికల సమయానికి పరిస్థితి మరింత ముదిరితే వైసీపీపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.