‘మేమూ సంపాదిస్తున్నాం’.. చంద్రబాబుకు మహిళల ఆసక్తికర సమాధానం!
03:27 pm Aug 15, 2026

..బస్సు ఛార్జీ మిగిలింది... మా ఆదాయం పెరిగింది.
..మేమూ సంపాదిస్తున్నాం... మరికొందరికి ఉపాధి చూపిస్తున్నాం.
..క్యాంప్ కార్యాలయంలో మహిళలకు సీఎం చంద్రబాబు తేనేటీ విందు.
..స్త్రీ శక్తికి సంవత్సరం-రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమం సందర్బంగా మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.

మహానాడు, అమరావతి: గతేడాది ఆగస్టు 15న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోజుకు సుమారు 24 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు తమ డబ్బును ఆదా చేసుకుంటున్నారని.. ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని సీఎం అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం పెరిగాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా స్త్రీ శక్తికి సంవత్సరం... రెట్టింపైన ఆత్మవిశ్వాసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. రాజధానిలో జెండావిష్కరణ తర్వాత అమరావతి పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం మహిళలకు తేనీటి విందు ఇచ్చారు. ప్రయాణం పొడవునా.. ఆ తర్వాత తేనీటి విందు సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి ఆత్మీయంగా ముచ్చటిస్తూ కుటుంబ పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, పిల్లల చదువులు, ఆరోగ్యం, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ మత్స్యకార మహిళతో మాట్లాడిన సీఎం... చేపల విక్రయానికి ఎక్కడెక్కడికి వెళ్తారని, స్త్రీ శక్తి పథకం వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలుగుతోందని అడిగారు. బస్సు చార్జీల కోసం గతంలో ఖర్చయ్యే డబ్బు ఇప్పుడు మిగులుతోందని.. నెలకు సుమారు రూ.4 వేలు ఆదా అవుతోందని ఆమె తెలిపారు. తనకు మధుమేహం సమస్య ఉందని, ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధితో మందులు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పడంతో... సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే అనారోగ్య బారినపడకుండా ఉండొచ్చని, ఆరోగ్యం బాగుంటే మందుల ఖర్చు కూడా తగ్గుతుందని ముఖ్యమంత్రి సూచించారు. నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం మహిళతో మాట్లాడిన సీఎం... కుటుంబ పరిస్థితులు, పిల్లల వివరాలు, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న లబ్ధిపై ఆరా తీశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా నెలకు సుమారు రూ.1,500 ఆదా అవుతోందని ఆమె చెప్పారు. స్త్రీ శక్తితో పాటు తనకు మొత్తం నాలుగు పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు.

విద్యార్థినులకూ స్త్రీ శక్తి వరం...

ముఖాముఖి సందర్బంగా ఓ యువతితో మాట్లాడిన సీఎం... విద్య కోసం ప్రతిరోజూ ఎంత దూరం ప్రయాణిస్తావని, బస్సు ఛార్జీల కోసం గతంలో ఎంత ఖర్చయ్యేదని అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతోందని ఆమె తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల తన కుటుంబ ఖర్చు తగ్గిందని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మహిళతో సీఎం సంభాషించారు. చేనేత ఉత్పత్తులకు ముడిసరుకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని, తయారైన చీరలను ఎలా మార్కెటింగ్‌ చేస్తున్నారని అడిగారు. ముడిసరుకు కొనుగోలుకు వెళ్లడం, నేసిన చీరలను షాపులకు తీసుకెళ్లి విక్రయించేందుకు ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతోందని ఆమె తెలిపారు. స్త్రీ శక్తితో పాటు నేతన్న సేవలో పథకం ద్వారా అదనపు ఆదాయం వస్తోందని చెప్పారు. గతంలో తన భర్త ఒక్కరే బయటకు వెళ్లి వ్యాపారం చేసేవారని... ఇప్పుడు తాను కూడా బయటకు వెళ్లడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతున్నామని చేనేత మహిళ వివరించారు. ఇలా ఆదా చేసుకున్న డబ్బునే పెట్టుబడిగా మలుచుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మరో యువతి స్త్రీ శక్తి పథకం ద్వారా నెలకు సుమారు రూ.3 వేల వరకు ఆదా చేసుకుంటున్నామని సీఎంకు తెలిపారు. ప్రయాణ ఖర్చు తగ్గడంతో మిగిలే మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నామని చెప్పారు. మహిళలు ఎక్కువగా సంపాదిస్తున్నారా? పురుషులు ఎక్కువగా సంపాదిస్తున్నారా? అని సీఎం అడగ్గా.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని మహిళలే ఎక్కువగా సంపాదించే స్థాయికి వస్తున్నారని, తాము మరికొందరికి ఉపాధి కూడా కల్పించగలుగుతున్నామని పలువురు మహిళలు తెలిపారు. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇంటికే పరిమితం కాకుండా... ఇప్పుడు మార్కెట్లకు, వ్యాపార కేంద్రాలకు, ఉద్యోగాలకు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నామని పలువురు తెలిపారు.

భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించండి...

స్త్రీ శక్తి పథకం వల్ల ప్రస్తుతం ఎంత ఆదా అవుతోందనే విషయంతో పాటు.. రాబోయే పదేళ్లలో ఏం సాధించాలనుకుంటున్నారో కూడా సీఎం చంద్రబాబు మహిళలను అడిగారు. కడప జిల్లాకు చెందిన ఓ ముస్లిం మహిళ తన డ్వాక్రా సంఘం ద్వారా రూ.కోటి పెట్టుబడితో వ్యాపారం చేయాలన్నది తన లక్ష్యమని తెలిపారు. విశాఖకు చెందిన ఓ ఉద్యోగిని ఏఐ రంగంలో నైపుణ్యం సాధించి.. తాను ఎంచుకున్న సాఫ్ట్‌వేర్‌ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలనుకుంటున్నట్టు వివరించారు. మహిళల సమాధానాలను ఆసక్తిగా విన్న సీఎం.. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కష్టపడాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే తాను మహిళలతో నేరుగా మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ‘అను నేను’ అనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి చెప్పారు.