మహిళలతో కలిసి బస్సులో సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మహానాడు, అమరావతి: స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం.. అనంతరం క్యాంప్ కార్యాలయంలో స్త్రీ శక్తి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు.
మహిళలకు తేనేటీ విందు ఇచ్చిన ముఖ్యమంత్రి.. వారి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
మహిళల లక్ష్యాలపై సీఎం ఆరా
రాబోయే పదేళ్లలో ఏం సాధించాలని అనుకుంటున్నారని చంద్రబాబు మహిళలను అడిగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ భవిష్యత్ లక్ష్యాలను సీఎంతో పంచుకున్నారు.
కడప జిల్లాకు చెందిన ఓ ముస్లిం మహిళ తన డ్వాక్రా సంఘం ద్వారా రూ.కోటి పెట్టుబడితో వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
విశాఖకు చెందిన ఓ ఉద్యోగిని ఏఐ రంగంలో నైపుణ్యం పెంచుకుని సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తన లక్ష్యాన్ని వివరించారు.
స్త్రీ శక్తి పథకం ద్వారా నెలకు సుమారు రూ.3 వేల వరకు ఆదా చేసుకోగలుగుతున్నామని మరో యువతి సీఎంకు తెలిపారు. ప్రభుత్వ పథకాలతో తాము ఆర్థికంగా ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుతున్నామని పలువురు మహిళలు చెప్పారు.
ఏడాదిలో 87 కోట్ల ఉచిత ప్రయాణాలు
స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు.
వివిధ ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చు ఆదా అవుతోందని చెప్పారు. భవిష్యత్‌లో మహిళల ఆదాయం పెరగడంతో పాటు వారి ఆరోగ్యం కూడా మెరుగుపడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం
డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సీఎం సూచించారు.
డ్వాక్రా సంఘాల ద్వారా ప్రస్తుతం సుమారు రూ.25 వేల కోట్ల పొదుపు సొమ్ము బ్యాంకుల్లో ఉందని చంద్రబాబు తెలిపారు. మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని ప్రశంసించారు.
పేద కుటుంబాలకు మరింత చేయూత అందించేందుకు పీ4 వంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
విద్య, ఆరోగ్యంపై దృష్టి
ప్రతి ఒక్కరూ చదువుకుంటే మంచి ఆలోచనలు వస్తాయని, మంచి ఆలోచనలతో కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని సీఎం అన్నారు.
ఎంత మంది పిల్లలు ఉన్నా వారికి విద్యకు మద్దతుగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజారోగ్యం కోసం సరైన ఆహారంపై కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై కఠిన చర్యలు
రాష్ట్రంలో రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని నియంత్రించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గంజాయి నిర్మూలనపై మహిళలు కూడా అవగాహన పెంచాలని, రాజకీయాల ముసుగులో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అమరావతి చూపించాలని మహిళల కోరిక
అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలను చూడాలని మహిళలు సీఎంను కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు రాజధాని నిర్మాణాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు వారికి సురక్షిత వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.
